నేడు హైదరాబాద్‌లో భారీ వర్షాలు
హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది.
By అంజి
నేడు హైదరాబాద్‌లో భారీ వర్షాలు
హైదరాబాద్: నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా ఐఎండీ హైదరాబాద్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి సహా అన్ని నగరంలోని మండలాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
తెలంగాణలోని ఇతర జిల్లాలకు, జూన్ 11 వరకు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు పడే అవకాశం ఉందని, ఎల్లో అలర్ట్ ను డిపార్ట్‌మెంట్ జారీ చేసింది. హైదరాబాద్ విషయానికొస్తే, ఎల్లో అలర్ట్ ఈరోజు మాత్రమే ఉంటుంది. అయితే జూన్ 10 వరకు నగరంలో ఆడపాదడపా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో రుతుపవనాలు ముందుకు సాగుతున్నాయి
కర్ణాటకలోని చాలా ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింతగా విస్తరించాయని ఐఎండీ నిన్న ప్రకటించింది. ఐఎండీ ప్రకారం.. కర్ణాటక, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు (ముంబయితో సహా), తెలంగాణా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, అరేబియాలోని అదనపు ప్రాంతాలలో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వచ్చే 3-4 రోజుల పాటు వర్షాలు కురవననున్నాయి.
నిన్న నగరంలో వర్షాలు కురిశాయి
నిన్న హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక ప్రాంతాలు వరద నీటి సమస్యలతో ఇబ్బందులు పడ్డాయి. తీవ్రమైన వర్షాల కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఐఎండీ హైదరాబాద్ ఈరోజు వర్షపాతం గురించి అంచనా వేసిన దృష్ట్యా, చాలా ప్రాంతాలు మళ్లీ వరద నీటి సమస్యలు, ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.