హిజాబ్ అంశంపై సుప్రీం కోర్టు పరస్పర భిన్న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసులో విభిన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధూలియా వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. కర్నాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. జస్టిస్ సుధాన్షు ధులియా మాత్రం హైకోర్టు తీర్పును తోసిపుచ్చారు. భిన్న అభిప్రాయాలతో కూడిన తీర్పు నేపథ్యంలో విస్తృత ధర్మాసనానికి కేసు బదిలీ చేయాలని జడ్జీలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఫార్సు చేశారు.
ఈ పరిణామాలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ముస్లిం బాలికల హిజాబ్‌ను బలవంతంగా తొలగించాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. చిన్న పిల్లలను హిజాబ్ ధరించమని బలవంతం చేస్తున్నారని వారు అంటున్నారు. మేము నిజంగా మా అమ్మాయిలను బలవంతం చేస్తున్నామా? అని ఆయన ప్రశ్నించారు. మా కుమార్తెలను హిజాబ్ ధరించనివ్వండి, మీకు నచ్చితే మీరు మీ బికినీలు ధరించండని అన్నారు. గోల్కొండ కోటలో నిర్వహించిన ఒక సభలో అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.