'నేను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేనే'.. దానం నాగేందర్‌ హాట్‌ కామెంట్స్‌

బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని, తాను ఆ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు.

By -  అంజి
Published on : 24 Dec 2025 1:01 PM IST

Congress MLA, MLA Danam Nagender, BRS, Hyderabad

'నేను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేనే'.. దానం నాగేందర్‌ హాట్‌ కామెంట్స్‌

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని, తాను ఆ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించబోతున్నట్టు చెప్పారు. ఎంఐఎంతో కలిసి మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనర్హత పిటిషన్ల నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలంతా తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్టు చెబుతుండగా దానం వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

''ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు ఏ పార్టీ లో ఉన్నారో నాకు తెలియదు కానీ... నేను మాత్రం కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నాను. జీహెచ్‌ఎంసీ.. ఓఆర్‌ఆర్‌ వరకు విస్తరించడం తో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంతో కలుపుకొని కాంగ్రెస్ 300 డివిజన్‌లలో గెలుస్తుంది. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే గెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్ లను తిరుగుతా. కాంగ్రెస్ పథకాలకు ప్రజల వివరిస్తా'' అని దానం నాగేందర్‌ అన్నారు.

ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్‌ రాజీనామాకు సిద్ధపడ్డారని తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఫిరాయింపు ఫిర్యాదుపై ఇప్పటి వరకు సభాపతికి వివరణ ఇవ్వని ఆయన తాను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేనే అని మీడియాతో అన్నారు. 2023లో ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి 2024లో సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. ఈయన విషయంలో ఆధారాలు అధికారికంగా ఉండటంతో వేటు తప్పదని తెలిసే ఆయన ఈ ప్రకటన చేసినట్టు సమాచారం.

Next Story