HYD: మారుతున్న ప్రగతినగర్ చెరువు రూపరేఖలు..1.5 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్‌

ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువు అభివృద్ధికి హైడ్రా కృషి చేస్తోంది.

By -  Knakam Karthik
Published on : 12 Feb 2026 8:00 AM IST

Hyderabad News, Kukatpally, Pragathi Nagar Lake, Hydraa,  Save Lakes

HYD: మారుతున్న ప్రగతినగర్ చెరువు రూపరేఖలు..1.5 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్‌

హైదరాబాద్: ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువు అభివృద్ధికి హైడ్రా కృషి చేస్తోంది. చెరువులో దుర్గంధం వెద‌జ‌ల్లుతున్న పూడిక‌ను ఇటీవ‌ల తొల‌గించిన హైడ్రా.. ఇప్పుడు చెత్త వేయ‌కుండా రోడ్డు పోడవునా ఫెన్సింగ్ వేసింది. చెరువు మ‌ధ్య‌లో ఉన్న‌ రోడ్డు పొడవునా చికెన్‌, మాంసం, చేపల విక్రేతలతో పాటు.. బ‌య‌ట దుకాణ దారులు కూడా వ్యర్థాలను పడేస్తున్నారని HYDRAAకు స్థానికులు ఫిర్యాదు చేశారు. జంతు వ్యర్థాలను ఇలా డంప్ చేయడం వల్ల దుర్వాసన వ‌స్తోంద‌ని పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు ముందు అక్క‌డ పేరుకుపోయిన జంతు వ్య‌ర్థాల‌ను హైడ్రా అధికారులు తొల‌గించారు. ఇలా 145 లారీల వ‌ర‌కూ పేరుకుపోయిన చెత్త‌ను క్లియ‌ర్ చేశారు. అక్క‌డ వ్య‌ర్థాల‌ను వేస్తున్న దుకాణ దారుల‌కు ప్ర‌త్యామ్నాయ స్థ‌లాన్ని చూపించి కూడా ఖాళీ చేయించారు. చెరువు మ‌ధ్య‌లో ఉన్న రోడ్డు మార్గాన వెళ్తూ చెత్త విసిరేయ‌డానికి అవ‌కాశం లేకుండా 10 మీట‌ర్ల ఎత్తులో హైడ్రా ఫెన్సింగ్ వేశారు. కిలోమీట‌రున్న‌ర మేర ఫెన్సింగ్ వేసి వ్య‌ర్థాలు చెరువులో ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. చెరువులో మురుగు నీరు క‌ల‌వ‌కుండా.. అభివృద్ధి ప‌నులు త్వ‌ర‌లో హైడ్రా చేప‌ట్ట‌నుంది.

ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గ‌డంతో రాక‌పోక‌లు సుల‌భం..

కూక‌ట్‌ప‌ల్లి - ప్ర‌గ‌తిన‌గ‌ర్‌ల‌ను క‌లుపుతూ చెరువు మ‌ధ్య‌లోంచి వేసిన ర‌హ‌దారిపై ఇరువైపులా ఉన్న ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గ‌డంతో ఆయా ప్రాంతాల్లో నివ‌సిస్తున్న ల‌క్ష‌లాది మంది ఎంతో సంతోషం వ్య‌క్తం చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది తొల‌గింద‌ని.. రాక‌పోక‌లు ఎంతో సుల‌భం అయ్యింద‌ని పేర్కొన్నారు. భారీయెత్తున్న రోడ్డుకు ఇరువైపులా వేసిన చెత్త‌ను తొల‌గించ‌డంతో దుర్గంధం త‌గ్గింద‌న్నారు. ఒక‌ప్పుడు ప‌క్షుల కిల‌కిల‌రావాల‌తో.. వ‌ల‌స‌ప‌క్షుల విడిదితో ఆహ్లాదంగా ఉన్నప్ర‌గ‌తిన‌గ‌ర్ (అంబీర్‌)చెరువుకు హైడ్రా పూర్వ వైభ‌వం తీసుకురావాల‌ని ప‌లువురు ఈ సంద‌ర్భంగా హైడ్రాను కోరారు. హైడ్రా చర్యలకు మద్దతు ప్రకటించారు. చెరువులో మీట‌ర్ల‌కొద్దీ ఉన్న పూడిక‌ను తొల‌గించి.. మురుగు నీరు క‌ల‌వ‌కుండా డైవ‌ర్ట్ చేయ‌డం, ఎస్టీపీలు ఏర్పాటు చేయాల‌ని కోరారు. వెంట‌నే ఈ చెరువు అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని హైడ్రాను కోరారు. న‌గ‌రంలో ఇత‌ర చోట్ల అభివృద్ధి చేసిన మాదిరే ప్ర‌గ‌తిన‌గ‌ర్ చెరువు రూపురేఖ‌ల‌ను కూడా మార్చాల‌ని ప‌లువురు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

Next Story