సంధ్యా కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు
సంధ్యా కన్వెన్షన్ నిర్వహిస్తున్న సంధ్యా–శ్రీధర్ రావు నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మరోసారి చర్యలు తీసుకున్నారు.
By - Knakam Karthik |
సంధ్యా కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు
హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఎఫ్‌సీఐ లే అవుట్‌లో సంధ్యా కన్వెన్షన్ నిర్వహిస్తున్న సంధ్యా–శ్రీధర్ రావు నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మరోసారి చర్యలు తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదులపై కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నుంచి భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు చేపట్టారు.ఎఫ్‌సీఐ లే అవుట్‌లోని అసలు ప్లాట్లను ఆక్రమించి రోడ్లు వేయడం, కన్వెన్షన్ విస్తరణలు చేయడం వంటి అక్రమాలకు గురైనట్లు పలువురు ప్లాట్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం సంధ్యా–శ్రీధర్ రావు చేపట్టిన ఆక్రమణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాధితుల హక్కులను కాల రాసే విధంగా జరిగిన అక్రమా లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సాహం ఉండకూడదని వ్యాఖ్యానించింది.ఆక్రమణలను వెంటనే తొలగించాలని హైడ్రాకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు, అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఎఫ్‌సీఐ లే అవుట్ బాధితులకు సంపూర్ణ సహకారం అందించాలని, వారి హక్కులను కాపాడే దిశగా చర్యలు వేగంగా కొన సాగించాలని సూచించింది. కోర్టు ఆదేశాల అనంతరం హైడ్రా బృందం ఈరోజు ఉదయం నుంచే సంధ్యా కన్వెన్షన్ పరిసర ప్రాంతంలోకి చేరుకుని అక్రమంగా నిర్మించిన గోడలు, రోడ్లు, విస్తరణలను తొలగించాయి. దీంతో ఎఫ్‌సీఐ లే అవుట్ మరోసారి భారీ కూల్చివేతలకు వేదికైంది. ఈ చర్యలతో బాధితులకు న్యాయం దక్కుతుందనే ఆశ వ్యక్తమవుతుండగా, అక్రమ నిర్మాణాలపై కఠిన వైఖరి కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.