హైదరాబాద్: నగర శివార్లలోని నాచారం పరిధిలో చోటుచేసుకున్న హత్య కేసు కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్యే భర్తను రాడ్డుతో కొట్టి హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ నేరానికి ఆమె వివాహేతరుడు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన నారాయణ్ బెహరా తన భార్య బంధిత బెహరాతో కలిసి నాచారం మల్లాపూర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.
నారాయణ్ ప్లంబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. బంధిత బెహరా గృహిణిగా ఉండేది. అయితే అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న విద్యాసాగర్‌తో బంధితకు గత నాలుగు నెలలుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణ్ భార్యను ప్రశ్నించడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో తమ సంబంధానికి నారాయణ్ అడ్డుగా మారుతున్నాడని భావించిన బంధిత, తన ప్రియుడు విద్యాసాగర్‌తో కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నింది.
అనుకున్నట్టుగానే రాడ్డుతో దాడి చేసి నారాయణ్‌ను హతమార్చింది. ఆపై తన భర్త హత్యకు గురయ్యాడంటూ నాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా, అనుమానం రావడంతో మృతుడి భార్య బంధితను విచారించారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించడంతో పాటు జరిగిన విషయాలను వెల్లడించింది. ఆమె ఇచ్చిన సమాచారం ఆధారంగా విద్యాసాగర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన 24 గంటల లోపే నిందితులను అరెస్ట్ చేసిన నాచారం పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.