Hyderabad: ప్రారంభోత్సవానికి సిద్ధమైన సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌

ఓఆర్‌ఆర్‌ చుట్టూ చేపట్టిన సస్టెయినబుల్‌ సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ పనులు చివరి దశలో ఉన్నాయని ప్రభుత్వ అధికారి తెలిపారు.

By అంజి
Published on : 11 Aug 2023 10:37 AM IST

Hyderabad,solar powered cycling track, ORR, Telangana Govt

Hyderabad: ప్రారంభోత్సవానికి సిద్ధమైన సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌

ప్రపంచ స్థాయి వసతులు, సదుపాయాలతో హైదరాబాద్ వాసుల జీవన ప్రమాణాలు మెరుగు పెంచేందుకు తెలంగాణ సర్కార్‌ కృషి చేస్తోంది. రోడ్లు, పబ్లిక్ ట్రాన్స్ పోర్టు తదితర అంశాల్లో అత్యుత్తమ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణాన్ని హెచ్ఎండీఏ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సస్టెయినబుల్‌ సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ పనులు చివరి దశలో ఉన్నాయని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (ఎంఏ అండ్‌ యూడీ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తెలిపారు.

శుక్రవారం అధికారులు ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. సోషల్ మీడియా పోస్ట్‌లో.. సైక్లింగ్ ట్రాక్ ప్రాజెక్ట్ చివరి దశలోకి ప్రవేశిస్తోందని, కొన్ని తుది మెరుగులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీటిలో ట్రాక్ కలరింగ్, లైటింగ్ ఫిక్చర్‌ల ఇన్‌స్టాలేషన్, పవర్ గ్రిడ్‌తో సింక్రొనైజేషన్, ముఖ్యంగా క్రాసింగ్‌ల వద్ద భద్రతా సంకేతాలను ఉంచడం వంటివి ఉన్నాయి. మరో రెండు వారాల్లో ఈ పనులు పూర్తి కానున్నాయని ఆయన పేర్కొన్నారు. “లైటింగ్ చేయబడుతోంది. రాత్రిపూట సైక్లింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. మేము దారిలో కిలోమీటర్‌ సంకేతాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము” అని ఆయన తెలిపారు.

సెప్టెంబరు మొదటి వారంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరుగుతుందని అరవింద్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ చేసే వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. వివిధ రంగాలకు చెందిన వారు సైకిల్ రైడ్స్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో కూడా చాలా మంది సైక్లింక్ పై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణాన్ని చేపట్టింది.

Next Story