మరో ఐదు రూపాయలు పెరిగిన ఇరానీ చాయ్ ధర..!
Hyderabad’s Irani Chai to now cost Rs 5 extra. హైదరాబాద్‌లో అత్యంత ఇష్టపడే పానీయమైన ఇరానీ చాయ్ ధర పెరిగింది.
By Medi Samrat Published on 25 March 2022 4:35 PM ISTహైదరాబాద్‌లో అత్యంత ఇష్టపడే పానీయమైన ఇరానీ చాయ్ ధర పెరిగింది. ఇకపై ఇరానీ చాయ్ కప్పు ధర రూ.20కు అందుబాటులో ఉండనుంది. నగరంలోని చాలా కేఫ్‌లు, హోటళ్లలో కప్పు ధరను రూ.15 నుంచి రూ.20కి పెంచారు. పాలు, టీపొడి, పంచదార ధరలు పెరగడం వల్లే ధరలు పెరిగాయని హోటల్ యజమానులు చెబుతున్నారు. ఇరానీ చాయ్ మాత్రమే కాదు.. జఫ్రానీ టీ ధర కూడా 5 రూపాయలు పెరిగింది. ఇంధనం, వాణిజ్య వంట గ్యాస్ ధరల పెరుగుదల కూడా రేటు పెంపును ప్రభావితం చేసింది. కొన్ని కేఫ్‌లు, హోటళ్లు ఇప్పటికే ధరలను పెంచినప్పటికీ.. మరికొన్ని చోట్ల రంజాన్ సీజన్ తర్వాత ధర పెంచవచ్చని ప్రముఖ కేప్ నిర్వహకుడు చెప్పారు.
ఇంధనం, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్, పశువుల దాణా వంటి ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల పాల ధర పెరిగింది. అమూల్, పరాగ్, వెర్కా వంటి డెయిరీ కంపెనీలు ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా పాల ధరలను రూ.2 పెంచాయి. కేంద్రం ఇటీవల ఎల్‌పిజి ధరను సిలిండర్‌కు రూ. 50 పెంచడంతో.. నగరంలో గ్యాస్ రూ.1,002 కు లభ్యమవుతుంది. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి పెంపు అనివార్యమైందని.. ధరలు పెరుగుతూ ఉంటే మాకు కష్టంగా ఉంటుందని మరొక టీ స్టాల్ యజమాని అంటున్నారు. కొంతమంది ధరల పెరుగుదల పట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. రేటు పెంపు వ్యాపారంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మహమ్మారికి ముందు.. ఒక కప్పు ఇరానీ చాయ్ పుల్ కప్ రూ. 10 ఉండేది. సింగిల్ చాయ్ రూ. 8. 2020లో లాక్‌డౌన్ సమయంలో ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఫుల్ కప్ ధర రూ.15కి పెరిగింది. ఆ తర్వాత మరోమారు ఇప్పుడు ధర పెరిగింది.