హైదరాబాద్ నగరంలో త్వరలో ఆరామ్‌ఘర్ నుండి నెహ్రూ జూలాజికల్ పార్క్ మార్గంలో 4.048 కిలోమీటర్ల మేర విస్తరించి రెండవ పొడవైన ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం 11.6 కిలోమీటర్ల పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే నగరంలోనే కాకుండా దేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్. బుధవారం ఫ్లైఓవర్ పనుల పురోగతిని పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వచ్చే ఏడాది మార్చిలోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూ. 636.80 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డిపి) కింద నిర్మించబడుతున్న ఈ ద్వి-దిశాత్మక ఆరు లేన్ల ఫ్లైఓవర్ మార్చి 2023 నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ఈ సదుపాయం ప్రజలకు అందుబాటులోకి వస్తే ఐదు ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. 127 పునాదులపై ఈ ఫ్లైఓవర్ నిలుస్తుందనీ, 23 చోట్ల తవ్వకం పూర్తయిందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. 4 కి.మీ మేర విస్తరించి ఉన్న ఫ్లైఓవర్‌ను నిర్మించే ఈ బృహత్తర కార్యానికి 163 ఆస్తులను సేకరించాల్సి ఉంటుంది. వాటిలో 26 ఆస్తులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ఓల్డ్ సిటీలో ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి, బహదూర్‌పురా జంక్షన్‌లో మరో ఆరు లేన్ల ద్వి దిశాత్మక ఫ్లైఓవర్ ఈ ఏడాది మార్చి నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఫ్లైఓవర్‌ను కూడా ఎస్‌ఆర్‌డిపి కింద జిహెచ్‌ఎంసి రూ. 69 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది. 690 మీటర్ల ఫ్లైఓవర్ బహదూర్‌పురా రోడ్డులో ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది.