హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగర శివార్లలోని నార్సింగి వద్ద శుక్రవారం ఉదయం అతివేగంగా నడుపుతున్న ట్రక్కు కారును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కారు వేగాన్ని తగ్గించడంతో వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతున్న ట్రక్కు వెనుక నుంచి ఢీ కొట్టిందని పోలీసు వర్గాలు తెలిపాయి. విద్యార్థులు సీబీఐటీ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. విచారణలో భాగంగా ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయింది. అయితే మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.