హైదరాబాద్: నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరగగా.. 4 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంటల్లో ఏడేళ్ల అఖిల్, పదకొండేళ్ల ప్రణీత్ సహా ఆరుగురు ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగతో రెస్క్యూకు ఆటంకం కలుగుతోంది. మరికొంత సమయం గడిస్తే గానీ పరిస్థితిపై అంచనాకు రాలేమని పోలీస్ కమిషర్ సజ్జనార్ తెలిపారు.
శనివారం మధ్యాహ్నం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నాలుగు అంతస్తుల భవనంలో కనీసం అరడజను మంది చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక, పోలీసు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), ఇతర సంస్థలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్రాథమిక సమాచారాన్ని ఉటంకిస్తూ, AIMIM MLC మీర్జా రహమత్ బేగ్ మాట్లాడుతూ, ఆటోడ్రైవర్, వాచ్‌మెన్, అతని భార్య,ఇద్దరు పిల్లలు సహా ఆరుగురు వ్యక్తులు లోపల చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. భవనం అంతటా దట్టమైన పొగ కమ్ముకోవడంతో రెస్క్యూ సిబ్బందికి ఆపరేషన్ నిర్వహించడం కష్టమైంది. రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి సజ్జనార్ కూడా ఆ ప్రదేశాన్ని సందర్శించారు.
అటు అగ్ని ప్రమాదంతో నాంపల్లిలో భారీ ట్రాఫిక్ ఏర్పడిందని, ఇవాళ ఎవరూ నుమాయిష్‌కు రావొద్దని సూచించారు. 'నుమాయిష్ సందర్శకులకు ముఖ్య గమనిక. నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, సందర్శకులు తమ ఎగ్జిబిషన్ పర్యటనను ఈ రోజు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలిపారు.