Hyderabad: ఆకతాయిలకు సింహస్వప్నంగా 'షీ' టీమ్స్.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన 3,826 మంది పోకిరీలు

నమ్మి స్నేహం చేశారు. ఆ చనువుతో కొన్ని వ్యక్తిగత ఫొటోలు పంచుకున్నారు. అదే ఇప్పుడు ఆమె మెడకు ఉచ్చులా మారింది...

By -  అంజి
Published on : 25 Jan 2026 6:05 PM IST

Hyderabad, She Teams, arrest, harassment, CP Sajjanar

Hyderabad: ఆకతాయిలకు సింహస్వప్నంగా 'షీ' టీమ్స్.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన 3,826 మంది పోకిరీలు

నమ్మి స్నేహం చేశారు. ఆ చనువుతో కొన్ని వ్యక్తిగత ఫొటోలు పంచుకున్నారు. అదే ఇప్పుడు ఆమె మెడకు ఉచ్చులా మారింది. 'డబ్బులిస్తావా.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టమంటావా?' అంటూ నిత్యం వేధింపులు. చావలేక.. బతకలేక నరకయాతన అనుభవించిన ఆ యువతి చివరకు 'షీ టీమ్స్'ను ఆశ్రయించి విముక్తి పొందారు.

మరొకరు.. రోజూ ఆఫీస్‌కు వెళ్తుంటే చాలు, నీడలా వెంటపడటం.. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులు. ఫోన్ బ్లాక్ చేసినా కొత్త నంబర్లతో బూతులు తిడుతూ పైశాచిక ఆనందం. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ మహిళకు 'షీ టీమ్స్' అండగా నిలిచింది.

ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే కాదు.. హైదరాబాద్ నగరంలో ఎంతోమంది మహిళలు అనుభవించిన మూగవేదనకు ప్రతిరూపాలు. నగరంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ, వేధింపులకు పాల్పడే ఆకతాయిల ఆటకట్టించడంలో హైదరాబాద్ షీ టీమ్స్ మరోసారి తమ సమర్థతను చాటుకున్నాయి. ఏడాదిలో మొత్తం 1149 ఫిర్యాదులు అందగా, వాటన్నింటినీ షీటీమ్స్ అత్యంత బాధ్యతాయుతంగా పరిష్కరించాయి.

బ్లాక్‌మెయిలింగ్ భూతం.. 366 మందికి విముక్తి

ఈ ఏడాది నమోదైన కేసులను విశ్లేషిస్తే.. అత్యధికంగా 366 మంది బాధితులు 'బ్లాక్‌మెయిలింగ్' సమస్యతోనే షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమై, తీయని మాటలతో నమ్మించి చనువు పెంచుకోవడం.. ఆపై వీడియో కాల్స్, వ్యక్తిగత ఫోటోల ద్వారా ఉచ్చు బిగించడం పరిపాటిగా మారింది. వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేయడం, పంపిన ఫోటోలను సేవ్ చేసుకుని డబ్బుల కోసం వేధిస్తున్నారు. మరికొన్ని కేసుల్లో.. ప్రేమ విఫలమైన తర్వాత, పాత ఫోటోలను అడ్డం పెట్టుకుని మాజీ ప్రేమికులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. "నాతో మాట్లాడకపోతే, వేరే పెళ్లి చేసుకుంటే.. మన పాత ఫోటోలు నీ కాబోయే భర్తకు పంపిస్తా" అంటూ వేధిస్తున్న 366 కేసుల్లో షీ టీమ్స్ బాధితులకు అండగా నిలిచింది.

సాంకేతికత మాటున వేధింపులు

కొందరు ప్రబుద్ధులు స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా యాప్స్ చాటున దాక్కుని మహిళలను వేధిస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో నిద్రపోనివ్వకుండా చేయడం, కొత్త నంబర్లు, ఇంటర్నెట్ కాల్స్ ద్వారా అసభ్యంగా మాట్లాడుతూ పైశాచిక ఆనందం పొందడం వంటి ఘటనలు 121 నమోదయ్యాయి. ఈ తరహా కాల్స్ వల్ల తీవ్ర మానసిక క్షోభ అనుభవించామంటూ 50 మంది మహిళలు ఫిర్యాదు చేయగా, పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో నకిలీ ఐడీలు సృష్టించి వేధించడం, వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన కంటెంట్ పంపడం వంటి 82 కేసులను పోలీసులు పరిష్కరించారు.

ప్రేమ పేరుతో వల.. పెళ్లి అనగానే జలక్

ఈ ఏడాది అత్యంత ఆందోళన కలిగించే విషయం.. ప్రేమ, పెళ్లి పేరుతో జరిగిన మోసాలు. "నిన్ను పెళ్లి చేసుకుంటా" అని నమ్మించి శారీరకంగా లోబరుచుకోవడం, ఆర్థికంగా వాడుకోవడం, తీరా పెళ్లి ప్రస్తావన రాగానే ముఖం చాటేయడం వంటి 98 ఫిర్యాదులు అందాయి. ఇలాంటి కేసుల్లో బాధితులు తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. షీ టీమ్స్ వీరికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, మోసగాళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయించింది.

మఫ్టీలో నిఘా.. 3,826 మందికి కౌన్సెలింగ్

కేవలం ఫిర్యాదులే కాకుండా, క్షేత్రస్థాయిలోనూ షీ టీమ్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. నగరవ్యాప్తంగా 15 బృందాలు బస్టాండ్లు, కాలేజీలు, రద్దీ ప్రదేశాల్లో మఫ్టీలో నిఘా వేసి, 2025లో ఏకంగా 3,826 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో మెజారిటీ ఆకతాయిలకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వగా, తీవ్రత ఎక్కువగా ఉన్న ఘటనల్లో ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి జైలుకు పంపారు.

ఆడబిడ్డల జోలికొస్తే.. కఠిన చర్యలు తప్పవు: వీసీ సజ్జనర్, ఐపీఎస్, సీపీ, హైదరాబాద్

"మహిళల జోలికొస్తే.. ఇక మీ ఆటలు సాగవు. ముఖ్యంగా 'బ్లాక్‌మెయిలింగ్' పేరుతో ఆడబిడ్డలను భయపెట్టాలని చూస్తే, మీ భవిష్యత్తు జైలు గోడల మధ్యే అంతమవుతుంది. సోదరీమణులారా.. అధైర్యపడకండి. మీ వివరాలు బయటపడతాయన్న భయం అస్సలు వద్దు, వాటిని అత్యంత గోప్యంగా ఉంచుతాం. వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి. మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. మీకు రక్షణ కవచంలా నిలబడటానికి 'షీ టీమ్స్' ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆపదలో ఉన్నా, వేధింపులకు గురవుతున్నా తక్షణమే డయల్ 100 లేదా షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్‌ 9490616555 ను సంప్రదించండి.

Next Story