Hyderabad: మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అప్రమత్తం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎమిరేట్స్‌ EK-526 విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో..

By -  అంజి
Published on : 5 Dec 2025 12:12 PM IST

Hyderabad, Shamshabad Airport, bomb threat email , bomb, Emirates flight

Hyderabad: మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అప్రమత్తం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం

హైదరాబాద్‌: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎమిరేట్స్‌ EK-526 విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతా వ్యవస్థ ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు బెదిరించారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమిరేట్స్ విమానం అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాటు చేశారు.

విమాన పైలట్‌ను అలర్ట్ చేస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులను వెంటనే కిందకు దింపి.. ప్రత్యేక ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. బాంబ్ స్క్వాడ్‌ విమానాన్ని పూర్తిగా తనిఖీ చేస్తోంది. ఈ ఘటన కారణంగా ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్స్‌ వద్ద ప్రయాణికులు చిక్కుకు పోయారు. ఎయిర్ పోర్ట్ లో చిన్నారులతో ప్రయాణిస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలువురు ప్రయాణికులు భద్రతా సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. వేరే విమానాలలో గమ్యస్థానాలకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎయిర్‌పోర్ట్‌ ఎటు చూసినా ప్రయాణి కులతో కిటకిటలాడుతోంది. అటు ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బాంబు బెదిరింపు ప్రభావంతో విమాన షెడ్యూళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 71 విమానాలు రద్దు కాగా హైదరాబాద్‌కు రావాల్సిన 61 విమానాలు రద్దు అయ్యాయి. ఇక ఇప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న అయ్యప్ప స్వాములు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సరైన వసతులు అందకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

Next Story