మహిళ ప్రాణాలు తీసిన స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం

హైదరాబాద్‌లో ఓ మహిళను స్కూల్‌ బస్సు ఢీకొట్టింది. ఘటనలో మహిళ తీవ్రగాయాల పాలైంది. ఆ తర్వాత ఆస్పత్రి తరలించగా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2023 4:37 PM IST
Road Accident, School Bus, Hyderabad, Dilsukhnagar, Woman Dead

మహిళ ప్రాణాలు తీసిన స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం

హైదరాబాద్‌లో ఓ మహిళను స్కూల్‌ బస్సు ఢీకొట్టింది. ఘటనలో మహిళ తీవ్రగాయాల పాలైంది. ఆ తర్వాత ఆస్పత్రి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. కొందరు నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేస్తూ ఇతరుల ప్రాణాలకు హాని తలపెడుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఓ స్కూల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసి ఓ మహిళ ప్రాణాలను తీశాడు. ఇనాయత్‌ జంగ్‌ దేవ్‌డీ అషుర్‌ఖానా దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.

మీర్‌చౌక్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక మహిళ కూరగాయాలు కొనుగోలు చేసి లోహేకి కమాన్‌ దగ్గర రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుంది. రోడ్డు రద్దీగా ఉంది. వాహనాల రాకపోకలు ఎక్కువగానే ఉన్నాయి. ఉన్నట్లుండి దిల్‌సుఖ్‌నగర్‌కు పబ్లిక్‌ స్కూల్‌ బస్సు మహిళా పాదాచారివైపు దూసుకొచ్చింది. ఆమె దాన్ని గమనించే లోపే ఢీకొట్టేసింది. ఆ ఘటనలో మహిళ ఎగిరి పడిపోయింది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, మహిళ తనయుడు అలీ అబ్బాస్‌ ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమెకు సీరియస్‌గా ఉందని.. తాము అడ్మిట్‌ చేసుకోలేమని వైద్యులు చెప్పారు. దాంతో.. వెంటనే సదురు మహిళను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాకు తరలించాక వైద్యులు ఆమెను పరీక్షించి.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అయితే.. రోడ్డుప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీడియో ఆధారంగా స్కూల్‌ బస్సు డ్రైవరే నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేశాడని మృతురాలి తనయుడు ఆరోపణలు చేస్తున్నాడు. అతడి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు డ్రైవర్‌ యాదిరెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రిమాండ్‌కు తరలించినట్లు మీర్‌చౌక్‌ పోలీసులు తెలిపారు.



Next Story