గణేష్ నిమజ్జనానికి సిద్ధమైన హైదరాబాద్.. రాత్రంతా తిరగనున్న ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు, బస్సులు
గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ ముస్తాబైంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి.
By అంజి Published on 27 Sep 2023 6:30 AM GMTగణేష్ నిమజ్జనానికి సిద్ధమైన హైదరాబాద్.. రాత్రంతా తిరగనున్న ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లు, బస్సులు
గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ ముస్తాబైంది. గణేష్ నిమజ్జనం కోసం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. హుస్సేన్‌సాగర్‌తో పాటు నగరంలోని పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల గణేష్ నిమజ్జనాలు జరగనున్నాయి. ఇప్పటికే క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతో పాటు పెద్ద సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేసింది జీహెచ్‌ఎంసీ. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంది. హైదరాబాద్ పరధిలో 40 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25 వేల మందికిపైగా పోలీసులు మోహరించబోతున్నారు. అలాగే ఎవరైనా ప్రమాదవశాత్తు నీటిలో పడితే రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను రెడీ చేసింది. గణేష్ శోభాయాత్ర జరిగే రోడ్లపై మెడికల్ క్యాంప్‌లు, 79 ఫైరింజన్లను అందుబాటులో ఉంచింది. అలాగే నిమజ్జనానికి వచ్చే వారి కోసం జలమండలి 10 లక్షల నీళ్ల ప్యాకెట్లను రెడీ చేసింది.
గణపతులను గంగమ్మ చెంతకు చేర్చేందుకు 16 టైర్లతో కూడిన 250 టస్కర్లు, మరో 2 వేల ఇతర వాహనాలను రవాణాశాఖ సిద్ధం చేసింది. వీటిని నేటి సాయంత్రం 6 గంటల వరకు అందించనున్నారు. నిమజ్జనం రోజున ప్రయాణికుల కోసం హుస్సేన్ సాగర్‌కు నగరం నలుమూలల నుంచి 535 బస్సులను నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ 29వ తేదీ తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మెట్రో రైళ్లు కూడా రేపు అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నడవనున్నాయి. ఇదిలా ఉంటే.. 35 సంవత్సరాల తర్వాత మిలాద్ ఉన్ నబీ, గణేశ్ నిమజ్జనం ఒకే తేదీ రోజు రావడంతో పోలీసు అధికారులు ముందుజాగ్రత్తగా ముస్లిం మతపెద్దలతో మాట్లాడారు. మిలాద్ ఉన్ నబీ ర్యాలీని ఒకటో తేదీకి వాయిదా వేయించారు. కొందరు మాత్రం అదే రోజున జరపాలని పట్టుబడుతున్నారు.
హైదరాబాద్‌లో గణేష్ విసర్జనను పురస్కరించుకుని నగరంలోని శోభాయాత్ర జరిగే మార్గాల్లోని మసీదులను క్లాత్‌లతో కప్పివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇలా చేశారు. నగరంలోని అఫ్జల్ గంజ్, చార్మినార్ తదితర ప్రాంతాల్లోని మసీదులను భారీ క్లాత్‌లతో కప్పారు. గణేష్ ఊరేగింపు సందర్భంగా నగరంలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి చట్టాన్ని అమలు చేసే అధికారులు ఈ పద్ధతిని అనుసరించారు. కాగా, గణేష్ విసర్జన, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నగరంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
శాంతి భద్రతల దృష్ట్యా నగరంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు పోలీసులను మోహరించారు. నగరంలోని మతపరమైన ప్రదేశాల్లో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. ప్రముఖ మసీదులు, దేవాలయాల వద్ద భారీ భద్రతా బలగాలను మోహరించారు. హైదరాబాద్‌లో గురువారం జరిగే గణేష్ ఊరేగింపుల కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 50 వేల మంది పోలీసులను మోహరించారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు సమన్వయంతో వివిధ ప్రాంతాల్లో నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు
జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారని, అందులో దాదాపు 20 వేల విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కానున్నాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ పేర్కొంది. ఇతర ప్రధాన నిమజ్జన ప్రదేశాలలో సరూర్‌నగర్ సరస్సు, సఫిల్‌గూడ, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్ ట్యాంక్, పల్లె చెరువు, శంషాబాద్ సరస్సు, ఇబ్రహీంపట్నం ట్యాంక్, ఎదులాబాద్ ట్యాంక్ ఉన్నాయి.
విగ్రహాల నిమజ్జనానికి అనువుగా హుస్సేన్‌సాగర్ వద్ద తగినన్ని క్రేన్‌లు ఏర్పాటు చేశామని, ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో పటాకులు పేల్చడం, కాల్చడం పూర్తిగా నిషేధమని గతంలో ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలు సజావుగా జరిగేందుకు పౌరులందరూ శాంతి, ప్రశాంతతలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.