Hyderabad: పోటెత్తుతున్న వరద.. జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైనేజీలు, కాలువలు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి.
By అంజి Published on 26 July 2023 7:09 AM GMTHyderabad: పోటెత్తుతున్న వరద.. జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
హైదరాబాద్ నగరంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైనేజీలు, కాలువలు వరద నీటితో పొంగి పొర్లుతున్నాయి. అంతే కాకుండా భారీగా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లను జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల ఇళ్లల్లోకి వరద నీరు భారీగా చేరుకోవడంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సహాయం చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంతాలు, నాళాల పక్కన నివసించే వారిని వసతి గృహాలకు తరలిస్తున్నారు.
మరోవైపు హిమాయత్ సాగర్ నుండి పురాణ పూల్ మీదుగా మూసి పరివాహక ప్రాంతాల వైపు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో జంట జలాశయాల్లో నిండిపోయాయి. హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకోవడంతో ఉదృతంగా ప్రవహిస్తుంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1763.50 అడుగులుగా కొనసాగుతుంది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై హిమాయత్ సాగర్ కు భారీగా నీరు వచ్చి చేరడంతో 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
జల మండలి అధికారులు 4 గేట్లు రెండు ఫీట్ల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. గండిపేట జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1787.15 గా కొనసాగుతుంది. హైదరాబాద్ నగర పరివాహక ప్రాంతంలో భారీ వర్ష సూచన ఉన్నందున, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈరోజు మధ్యా హ్నం 1:00 గంటలకు ఉస్మాన్‌సాగర్ గండిపెట్ రెండు గేట్లను తెరిచి, ఔట్‌ఫ్లో 208 క్యూసెక్కులుగా నీరు వదలనున్నారు. ముఖ్యంగా పురాణపూల్, జియాగూడ, కుల్సుమ్ పురా పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్ బృందాలు లోతట్టు ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షితమైన వసతి గృహాలకు తరలిస్తున్నారు.