వైఎస్ షర్మిలపై హైదరాబాద్ పోలీసుల తీవ్ర ఆరోపణలు

సిట్ కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి

By అంజి  Published on  25 April 2023 9:45 AM IST
Hyderabad police, YS Sharmila, YSRTP, Telangana

వైఎస్ షర్మిలపై హైదరాబాద్ పోలీసుల తీవ్ర ఆరోపణలు

హైదరాబాద్: సిట్ కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల దాడి చేసి వాహనాన్ని ఢీకొట్టేందుకు ప్రయత్నించారని పోలీసులు అభియోగాలు మోపారు. సోమవారం షర్మిల పోలీసులను చెప్పుతో కొట్టి, ఆమె వాహనాన్ని వారిపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపే ఎఫ్‌ఐఆర్ కాపీని న్యూస్‌మీటర్ యాక్సెస్ చేసింది. బంజారాహిల్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. రవీందర్ తన ఫిర్యాదులో.. వైఎస్ షర్మిల (వైఎస్‌ఆర్‌టిపి ప్రెసిడెంట్) నిరసన పిలుపునిచ్చినందున సిట్ కార్యాలయానికి వెళ్లకుండా ఆపడానికి ఆమె ఇంటికి డిప్యూట్ చేశారని చెప్పారు.

''ఆమె చెప్పిన నిరసన కార్యక్రమానికి ఎటువంటి అనుమతి తీసుకోనందున, నేను సిట్ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి లోటస్ పాండ్‌లోని షర్మిల ఇంటికి పురుషులు, మహిళా సిబ్బందితో కలిసి చేరుకున్నాము. ఉదయం 10:45 గంటలకు ఆమె అకస్మాత్తుగా వెల్‌ఫైర్ వాహనంలో తన ఇంటి నుండి బయటకు వచ్చింది. మేము ఆమె కారును ఆపడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె ప్రోద్బలంతో డ్రైవర్ అత్యంత ప్రమాదకరమైన రీతిలో నడుపుతూ నాపై, ఇతర పోలీసు అధికారులపైకి దూసుకెళ్లాడు. అయితే మేము వాహనాన్ని ఆపాము. ఆమె కారు దిగి, మహిళా సిబ్బందిని తోసివేసి, కొద్ది దూరం నడిచి, మళ్లీ రెండోసారి తన ఫార్చ్యూనర్‌లోకి ఎక్కింది'' అని రవీందర్ చెప్పారు.

ఆమె ప్రోద్బలంతో డ్రైవరు సి బాబు ప్రమాదకరంగా వాహనం నడిపాడని, ఇలాంటి చర్య వల్ల పోలీసు అధికారులు గాయపడ్డారని ఆయన అన్నారు. “ఎం గిరి బాబు ఎడమ కాలికి గాయమైంది. మేము ఆమె కారును ఆపాము. డ్రైవర్‌ను కిందకు దించమని కోరగా, షర్మిల నన్ను, అనుసూజ, అనూషతో సహా ఇతర మహిళా కానిస్టేబుళ్లను చెప్పుతో కొట్టి, పోలీసులపై అనుచిత పదజాలం విసిరారు. ఆమె నా వీహెచ్‌ఎఫ్‌ హ్యాండ్‌సెట్‌ను లాక్కోవడానికి ప్రయత్నించింది. నా నేమ్‌ప్లేట్‌ను కూడా పట్టుకుని రోడ్డుపై విసిరింది'' అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

షర్మిల అధికారిక విధులు నిర్వర్తించే సమయంలో పోలీసు అధికారులకు ఆటంకం కలిగించడమే కాకుండా, నాపై, ఒక మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసి, తన డ్రైవర్‌ను కారుతో విధుల్లో ఉన్న ఇతర అధికారులపై ప్రమాదకరంగా దూసుకుపోయేలా ప్రేరేపించారని ఫిర్యాదు చేశారు.

Next Story