నగరంలో నెల రోజుల పాటు ఆంక్షలు

ప్రజల భద్రతను కాపాడే లక్ష్యంతో హైదరాబాద్ పోలీసులు నగరంలో బహిరంగ సభలు, నిరసనలు, ప్రదర్శనలపై కఠినమైన ఆంక్షలు విధించారు.

By Kalasani Durgapraveen  Published on  28 Oct 2024 11:56 AM IST
నగరంలో నెల రోజుల పాటు ఆంక్షలు

ప్రజల భద్రతను కాపాడే లక్ష్యంతో హైదరాబాద్ పోలీసులు నగరంలో బహిరంగ సభలు, నిరసనలు, ప్రదర్శనలపై కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ ఆంక్ష‌ల ఉత్తర్వులు అక్టోబర్ 27 ఆదివారం నుండి ప్రారంభమైన ఒక నెల అంటే నవంబర్ 28 సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. ఈ ఆంక్ష‌లు హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్‌లో అమలులో ఉంటాయి. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 కింద ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఆంక్ష‌ల్లో భాగంగా ఐదుగురికి మించి ఒక‌చోట‌ గుమికూడితే క‌ఠిన‌ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు, అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్న‌ట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేర‌కు ఆంక్షలు విధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏక్‌ పోలీస్‌ విధానం అమలు, సస్పెండ్‌ చేసిన కానిస్టేబుళ్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు గ‌త కొన్నిరోజులుగా చేస్తున్న ఆందోళన ఉద్ధృతమైంది. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని బెటాలియన్‌ కానిస్టేబుళ్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్ర‌మంలోనే నగరంలో నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్ తెలిపారు.

Next Story