హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసుల కాల్పులు కలకలం సృష్టించాయి. దోపిడీ దొంగల ముఠా పారిపోతుండగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగర పెద్ద అంబర్‌పేట సమీపంలో ఔటర్ రింగురోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల నేషనల్ హైవేపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నల్గొండ పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక నిఘా పెట్టారు. దొంగలను పట్టుకునేందుకు ఎస్పీ శరత్ చంద్రపవార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ పోలీసులు దొంగల ముఠాను గుర్తించారు. వారిని వెంబడించే క్రమంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాక ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. దొంగలను పట్టుకునేందుకు రాచకొండ, నల్గొండ పోలీసులు యత్నించారు. పెద్దఅంబర్‌పేట ఓఆర్‌ఆర్ దగ్గరకు వచ్చేసరికి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు కత్తులతో ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.