హైదరాబాద్: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఓ స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆపై ఫ్లైఓవర్ లెవల్ 2 నుంచి లెవల్ 1పైకి దూసుకెళ్లింది. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుడిని సిద్దిపేటకి చెందిన మధు (25)గా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ లెవల్ 2పై బైక్‌పై వెళ్తున్న వీరిద్దరూ పారాపెట్ గోడను ఢీకొట్టి లెవల్ 1 ఫ్లై ఓవర్‌పై పడిపోయారు. వీరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరిని పోలీసులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బైకర్లు తమ బైక్‌పై నియంత్రణ కోల్పోయి పారాపెట్ గోడను ఢీకొట్టారా లేదా మరేదైనా వాహనం బైక్‌ను ఢీకొట్టిందా అని నిర్ధారించడానికి పోలీసులు క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫీడ్‌ను ధృవీకరిస్తున్నారు. మరోవైపు మృతుడిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.