ఓల్డ్ సిటీ మెట్రో కోసం రోడ్డు విస్తరణ పనులు ముమ్మరం
ఒరిజినల్ సిటీ అయిన ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ ను త్వరగా పట్టాలు ఎక్కించడానికి సంబంధించిన స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం అయింది.
By Kalasani Durgapraveen Published on 15 Dec 2024 2:15 PM ISTఒరిజినల్ సిటీ అయిన ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ ను త్వరగా పట్టాలు ఎక్కించడానికి సంబంధించిన స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దాదాపు ఏడున్నర కిలోమీటర్ల నిడివి గల ఎంజీబీఎస్ - చంద్రాయణ్ గుట్ట మార్గంలో భూసేకరణ పనులు ముమ్మరమయ్యాయి. గుర్తించిన 1100 ప్రభావిత ఆస్తుల సేకరణ చకచకా సాగుతోంది.
భూసేకరణ చట్టానికి లోబడి ఈ ప్రభావిత 1100 ఆస్తులకు గాను ఇప్పటికే 900 ఆస్తులకు సంబంధించిన రిక్విజిషన్ ని జిల్లా కలెక్టర్ కి సమర్పించామని, వాటిలో 800 ఆస్తులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను దఫదఫాలుగా కలెక్టర్ జారీ చేసారని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నోటిఫై చేసిన ఆస్తులలో 400 ఆస్తులకు ప్రిలిమినరీ డిక్లరేషన్ ను కలెక్టర్ జారీ చేయడం పూర్తయ్యిందని ఆయన చెప్పారు. 200 ప్రభావిత ఆస్తుల పరిహారానికి సంబంధించిన అవార్డులను ఈ నెలాఖరులోగా ప్రకటించడం పూర్తవుతుందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. తదనంతరం వెంటనే వాటికి పరిహారం చెల్లించి వాటిని కూల్చే పనులు ప్రారంభం అవుతాయి. తద్వారా మెట్రో రైల్ మార్గ నిర్మాణాన్ని సుగమం చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ మార్గంలో ఉన్న వివిధ నిర్మాణాలు, ప్రభావిత ఆస్తుల యాజమానులతో సానులంగా చర్చించి, వాటిని భూసేకరణ చట్టం ప్రకారం సేకరించి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్టు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రోడ్డు విస్తరణలోను, మెట్రో నిర్మాణంలోను మతపరమైన మరియు చారిత్రక కట్టడాలన్నిటినీ తప్పించి వాటిని ఇంజినీరింగ్ సొల్యూషన్ల తో పరిరక్షిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
మెట్రో రైల్ రాకతో పాత నగరం ఎంతో ఆకర్షణీయ ప్రాంతంగా రూపుదాల్చుకోబోతోంది. ఉపాధి అవకాశాలు మెరుగు కావడమే కాకుండా, కాలుష్య రహితంగా ఈ ప్రాంతమంతా గొప్ప అభివృద్ధి సాధించనున్నది. ముఖ్యమంత్రి ఇక్కడి మెట్రో రైల్ మార్గం విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.
హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలక్టర్ అనుదీప్ దురిశెట్టి సంయుక్తంగా ఈ భూసేకరణ ప్రక్రియను నిరంతరం సమీక్షిస్తున్నారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు.