ఎనిమిదో నిజాం నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ మృతి
Hyderabad mourns the passing away of the 8th Nizam. ఎనిమిదో నిజాం నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ మృతి చెందారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 15 Jan 2023 1:39 PM GMTఎనిమిదో నిజాం నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ మృతి చెందారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్లో ఆయన కన్నుమూశారు. హైదరాబాద్ లో అంత్యక్రియలు చేయాలని బహదూర్ చివరి కోరిక కావడంతో ఆయన భౌతికకాయాన్ని టర్కీ నుంచి హైదరాబాద్కు తీసుకురానున్నారు.
ఫ్రాన్స్‌లో జన్మించి, టర్కీలో మరణించిన నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ కు హైదరాబాద్‌లోని మక్కా మసీదులోని ఆసిఫ్ జాహీ సమాధుల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రెండవ నిజాం నుండి ఆరవ నిజాం వరకు అతని రాజవంశీయులను ఖాననం చేశారు. నిజాం మరణవార్త హైదరాబాదీలను విషాదంలో ముంచెత్తింది. నవాబ్ భర్కత్ అలీఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ టర్కీలోని తన నివాసంలో ప్రశాంతంగా తుది శ్వాస విడిచారు. ఈ నెల 17న హైదరాబాద్కు ఆయన పార్ధీవ దేహం రానుంది. హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత ప్రజల సందర్శననార్ధం చౌమల్లా ప్యాలెస్లో భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం అసఫ్ జాహీ కుటుంబసభ్యుల సమాధుల మధ్య ముఖరం జా ను ఖననం చేస్తారు.
హైదరాబాద్ యొక్క ఏడవ , చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 14 జూన్ 1954న ప్రిన్స్ ముకరం ఝాను తన వారసుడిగా ప్రకటించారు. ముకరం ఝా 1971 వరకు హైదరాబాద్ యువరాజుగా పిలిచారు. నవాబ్ ఆజం జా బహదూర్, టర్కీ చివరి పాలకుడు ఖలీఫా అబ్దుల్ మజీద్ II కుమార్తె అయిన యువరాణి దుర్రుషెహ్వార్‌ల పెద్ద కుమారుడు. ముకర్రం జా టర్కిష్, దక్కనీ రాజ కుటుంబాల వారసుడు.
ముకరం ఝా మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.