Hyderabad: ఇంటిని దోచుకునేందుకు కుట్ర.. పోలీసుల అదుపులో ఐపీఎస్ అధికారి!
రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి చెందిన ఇంటిని దోచుకునేందుకు నకిలీ పత్రాలు సృష్టించాడన్న ఆరోపణలపై 2008 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
By అంజి Published on 28 Dec 2023 1:08 AM GMTHyderabad: ఇంటిని దోచుకునేందుకు కుట్ర.. పోలీసుల అదుపులో ఐపీఎస్ అధికారి!
హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి చెందిన ఇంటిని దోచుకునేందుకు నకిలీ పత్రాలు సృష్టించాడన్న ఆరోపణలపై 2008 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను హైదరాబాద్ పోలీస్ ఆర్థిక నేర విభాగం (ఈవోడబ్ల్యూ) బుధవారం డిసెంబర్ 27న విచారణ చేసింది. ఫిర్యాదుదారు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి భన్వర్ లాల్ భార్య మనీలాల్ తెలిపిన వివరాల ప్రకారం.. ''2014లో జూబ్లీహిల్స్‌లోని నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్లకు రెంటల్ అగ్రిమెంట్ చేశాం. 2019లో అగ్రిమెంట్ గడువు ముగిసిన తర్వాత ఖాళీ చేయమన్నాం. రెంటల్ అగ్రిమెంట్ కు విరుద్ధంగా నవీన్ కుమార్ అదే ఇంట్లో ఉంటున్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. మా ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారు'' అని నవంబర్ 17న భన్వర్ లాల్ సతీమణి మనీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న నవీన్‌కుమార్ (ఐపీఎస్) దంపతులతో కుమ్మక్కై, పైన పేర్కొన్న ఇంటిని ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించి ఫిర్యాదుదారుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నవంబర్ 17న, భన్వర్ లాల్ భార్య మనీలాల్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా దంపతులు, ఐపీఎస్ అధికారిపై 420, 406, 467, 468, 471 r/w 32 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. డిసెంబర్ 22న సాంబశివరావు, అతని భార్యను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కోసం కోర్టులో హాజరుపరచగా, నవీన్ కుమార్‌ను బుధవారం అదుపులోకి తీసుకుని విచారించారు.
అరెస్టును బీసీ సంక్షేమ సంఘం ఖండించింది
అధికారి వెనుకబడిన కమ్యూనిటీ (బీసీ)కి చెందినవాడు. నవీన్ కుమార్‌ను పోలీసులు విచారించడాన్ని బీసీ సంక్షేమ సంఘం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఖండించింది. బిసి అయిన నవీన్‌కుమార్‌కు పదోన్నతి కల్పించకుండా పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారని, అగ్రవర్ణ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి భన్వర్‌లాల్‌తో కుమ్మక్కై అతన్ని అదుపులోకి తీసుకున్నారని ఆరోపించింది.
నేను ఎలాంటి తప్పు చేయలేదు: ఐపీఎస్ నవీన్ కుమార్
ఇల్లు కబ్జా ఆరోపణలపై ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ స్పందించారు. ''నేను ఎలాంటి తప్పు చేయలేదు. మ్యాటర్ ఆల్రెడీ కోర్ట్ లో ఉంది. సివిల్ మ్యాటర్ పైన పోలీసులు కేస్ నమోదు చేశారు. వివరాల కోసం నన్ను పిలిచారు. నా దగ్గర ఉన్న సమాచారం అంతా ఇచ్చాము. 2020 నుండి ఈ వివాదం నడుస్తోంది. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తాను. లీగల్ గా ముందుకు వెళ్తా'' అని చెప్పారు.