హైదరాబాద్: అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
బంగారం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు
By తోట వంశీ కుమార్ Published on 2 March 2023 4:25 AM GMTబంగారం బిస్కెట్లు
హైదరాబాద్ : బంగారం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. ముగ్గురు స్మగర్లను అరెస్ట్ చేశారు. నిందితులను సయ్యద్ మోయిజ్ పాషా, సమీర్ ఖాన్, మహ్మద్ అర్షద్‌లుగా గుర్తించారు.
ఫలక్‌నుమా ప్రాంతంలోని ఖాద్రీ చమన్‌లో నివాసం ఉంటున్న సయ్యద్ మోయిజ్ పాషా (37) అనే ట్రావెల్ ఏజెంట్ బంగారం స్మగ్లింగ్ ఆపరేషన్‌కు ప్రధాన సూత్రధారి. రాజేంద్రనగర్‌లోని మైలదేవ్‌పల్లికి చెందిన వ్యాపారి సమీర్‌ఖాన్ (31) ట్రాన్స్‌పోర్టర్‌గా పనిచేస్తుండగా, రెయిన్‌బజార్‌కు చెందిన నగల వ్యాపారి (మసూద్ జ్యువెలర్స్) మహ్మద్ అర్షద్ (41) రిసీవర్‌గా ఉన్నారు.
నిందితుల నుంచి 700 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో దాదాపు 116 గ్రాముల బరువున్న 6 బంగారు బిస్కెట్లు ఉన్నాయి. బంగారంతో పాటు 13 పాస్‌పోర్టులు, 2 బంగారం విక్రయించిన రశీదులు, రూ.40,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎస్ఓటీ సైబరాబాద్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎం.ఎ రషీద్ మాట్లాడుతూ.. వృత్తిరీత్యా ట్రావెల్ ఏజెంట్ అయిన సయ్యద్ మోయిజ్ పాషా స్థానికంగా నమ్మకస్తులైన వారిని ఎంచుకుని, టూరిస్టు వీసాపై దుబాయ్‌కు పంపిస్తుంటాడు. గత నెలలో వట్టేపల్లికి చెందిన సమీర్ ఖాన్‌ను దుబాయ్ పంపించాడు. అక్కడ 700 గ్రాముల బంగారం బిస్కెట్లను కొనుగోలు చేసిన సమీర్‌ఖాన్ గత నెల 28న శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పిన అతడు బంగారం బిస్కెట్లను పాషాకు అందజేశాడు. పాషా బంగారాన్ని విక్రయిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్‌ఓటీ రాజేంద్రనగర్ జోన్ బృందం, కస్టమ్స్ అధికారులతో కలిసి వట్టెపల్లి, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో పట్టుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను జీఎస్టీ భవన్‌లోని కస్టమ్స్ అదనపు కమిషనర్‌కు అప్పగించారు.
ఎస్‌ఓటీ అడిషనల్ డీసీపీ పి నారాయణ, ఎస్‌ఓటీ రాజేంద్రనగర్ జోన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె వెంకట్ రెడ్డి నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందంతో పాటు హైదరాబాద్‌లోని కస్టమ్స్ అధికారుల సహకారంతో అరెస్టు చేశారు. ఈ బృందంలో ఎస్‌ఓటీ రాజేంద్రనగర్ మండలం ఎస్‌ఐ కె.రవి, హెచ్‌సీ సిరాజుద్దీన్, ఇతర సిబ్బంది ఉన్నారు.