హైదరాబాద్: నగరంలో అక్రమకట్టడాల కూల్చివేతపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దూకుడు కొనసాగుతోంది. తాజాగా హైడ్రా కూల్చివేతలపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయబోమన్నారు. కొత్త నిర్మాణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకొని కూలుస్తున్నట్టు తెలిపారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. చెరువు బఫర్‌జోన్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని తెలిపారు.
అటు సున్నం చెరువులో నిర్మించి కొన్ని షెడ్లు బిజినెస్ పరంగా ఉపయోగిస్తున్నారు. గతంలో వాటిని కూల్చేశాం.. ఇప్పుడు మళ్లీ నిర్మాణలు చేపట్టడంతో కూల్చివేస్తున్నాం అని రంగనాథ్ తెలిపారు. బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఆక్రమణలో ఉన్న ఏ ఇంటినీ కూల్చబోమని ప్రజలందరికీ హామీ ఇచ్చారు. రంగనాథ్ ప్రకటనతో ఇప్పటికే ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న యజమానులకు భారీ ఊరట కలిగింది. అయితే ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాలు, ఇళ్లను ఏ మాత్రం కొనుగోలు చేయొద్దని రంగనాథ్ ప్రజలకు సూచించారు.