హైదరాబాద్: అప్పు తీర్చాలంటూ ఫైనాన్షియర్లు ఒత్తిడి చేయడంతో ఇంజినీరింగ్ విద్యార్థి ఏప్రిల్ 27వ తేదీ శనివారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటుచేసుకుంది. మృతుడు ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం అప్పు తీసుకున్నట్లు సమాచారం. తెలిసిన మిత్రులు, యాప్‌ల ద్వారా అప్పులు తీసుకున్నాడు. డబ్బు మొత్తం పోగొట్టుకుని అప్పు తీర్చలేక పోయాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో చేసేదేంలేక, ఇంట్లో చెప్పుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టాడు.
చింతా వినీత్ (24) ఘట్కేసర్ గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వినీత్ కొంతకాలంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాడు. దీని కోసం ఆన్లైన్ యాప్స్ ,స్నేహితుల దగ్గర నుంచి రూ. 25 లక్షల వరకు అప్పుగా తీసుకొని ఐపీఎల్ బెట్టింగ్ లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో డబ్బులు చెల్లించలేక తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వినీత్ శనివారం ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సిఆర్‌పిసి సెక్షన్ 174 (అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేశారు. విద్యార్థి ఆత్మహత్యపై విచారణ ఇంకా కొనసాగుతోంది.