హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 2026లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో ఐదు రాష్ట్రాలకు చెందిన 20 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. మొత్తం 13 కేసులకు సంబంధించి విచారణ జరిపి, బాధితులకు రూ. 1.59 కోట్ల నగదును తిరిగి ఇప్పించారు. అరెస్టయిన వారిలో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, గేమింగ్, మ్యాట్రిమోనియల్, జాబ్ ఫ్రాడ్ వంటి వివిధ నేరాలకు పాల్పడిన వారు ఉన్నారు. వీరిలో 15 మంది తెలంగాణకు చెందిన వారు కాగా, మిగిలిన వారు ఏపీ, గోవా, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలకు చెందిన వారు. నిందితుల నుంచి రూ. 6.50 లక్షల నగదుతో పాటు ల్యాప్‌టాప్‌లు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
నేరాల నియంత్రణలో భాగంగా సోషల్ మీడియాలో బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌ను ప్రోత్సహిస్తున్న 129 ప్రొఫైల్స్‌ను గుర్తించి, వాటి ద్వారా రన్ అవుతున్న 494 పెయిడ్ యాడ్స్‌ను పోలీసులు తొలగింపజేశారు. యువతను ఆకర్షించి అక్రమ బెట్టింగులకు పాల్పడేలా చేస్తున్న ఈ ఖాతాలపై గట్టి నిఘా ఉంచారు. అలాగే 'సి-మిత్ర' (C-Mitra) చొరవ ద్వారా 1,730 మంది బాధితులకు అండగా నిలిచి, 262 జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి సత్వర సాయం అందించారు.