భారత స్వాతంత్య్రంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైదరాబాద్ నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. IPC సెక్షన్ 504, 505 ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు పోలీసులను కోరింది. నవంబర్ 10న కంగన్ రనౌత్ టైమ్స్ నౌ సమ్మిట్ 2021కి హాజరయ్యారు. అక్కడ ఆమె తన సినిమాలు, రాజకీయాలపై సుదీర్ఘంగా మాట్లాడింది. ఆ సందర్భంలో ఆమె.. భారతదేశానికి 2014లో స్వాతంత్య్రం వచ్చిందని.. 1947లో వచ్చిన స్వాతంత్ర్యం భీఖ్(భిక్షం) అని వ్యాఖ్యానించింది.
భారత స్వాతంత్య్రాన్ని 'భీఖ్'గా అభివర్ణించడం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను అవమానించడమేనని న్యాయవాది కారం కొమిరెడ్డి కోర్టులో ఫిల్ వేశారు. కంగనాపై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే.. పౌరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పరువు నష్టం కలిగించే, కించపరిచే విధంగా మాట్లాడి స్వాతంత్య్ర పోరాటాన్ని, స్వాతంత్య్ర సమరయోధులను కించపరుస్తూనే ఉంటారని ఫిర్యాదులో కోరారు. కంగనా వ్యాఖ్యలు భారత పౌరులకు మానసిక వేదన కలిగించిందని పేర్కొన్నారు.
ఈ విషయమై నవంబర్ 13న SHO సైఫాబాద్‌కి ఫిర్యాదు చేసానని.. అయితే వారు కేసు నమోదు చేయలేదన్నారు కారం కొమిరెడ్డి. పోలీసులు చర్యలు తీసుకుంటారని వారం రోజులు వేచి చూసినా.. అలా ఏమి జరగలేదని.. దీంతో కంగనాపై కేసు నమోదు చేయాల్సిందిగా సైఫాబాద్‌లోని ఎస్‌హెచ్‌ఓను ఆదేశించాలని కోరుతూ.. తాను కోర్టును ఆశ్రయించానని కారం న్యూస్‌మీటర్‌తో అన్నారు.