హైదరాబాద్: చిక్కడపల్లిలో డ్రగ్ నెట్‌వర్క్ గుట్టును పోలీసులు బయటపెట్టారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పని చేస్తున్న సుష్మిత తన బాయ్‌ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి MDMA డ్రగ్స్, LSD బాటిల్స్, ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది.
చిక్కడపల్లి ప్రాంతంలో డ్రగ్స్ దందా వెలుగులోకి రావడం కలకలం రేపింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తూనే అక్రమంగా డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ప్రేమజంటను పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడకు చెందిన సుష్మిత అనే యువతి ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తుండగా, ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన ఈ జంట నగరంలోని యువతను, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారని విచారణలో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించిన హెచ్ న్యూ పోలీసులు ప్రేమజంటతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో నిందితుల వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్, ఎల్‌ఎస్‌డీ బాటిళ్లు, ఓజీ కుష్ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది, మరెవరైనా ఈ ముఠాలో ఉన్నారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. నగరంలో మత్తు పదార్థాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, డ్రగ్స్ దందాలో పాల్గొనేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.