Hyderabad: కల్తీ కారం పొడి తయారీ.. ప్రముఖ బ్రాండ్‌తో ప్యాకింగ్‌.. ఒకరు అరెస్టు

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు కొందరు వ్యాపారులు. తాజాగా నగరంలో కల్తీ కారం పొడి వ్యవహారం బయటపడింది.

By అంజి  Published on  6 Nov 2024 6:57 AM IST
Hyderabad, Cops, Arrest, Spurious Chilli Powder

Hyderabad: కల్తీ కారం పొడి తయారీ.. ప్రముఖ బ్రాండ్‌తో ప్యాకింగ్‌.. ఒకరు అరెస్టు

హైదరాబాద్‌: ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు కొందరు వ్యాపారులు. తాజాగా నగరంలో కల్తీ కారం పొడి వ్యవహారం బయటపడింది. కల్తీ కారం పొడిని తయారు చేస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజస్థాన్‌కు చెందిన రూపారం ఖాత్రీ అలియాస్‌ రూపేశ్‌ కొన్ని ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో ఉంటూ గార్మెంట్స్‌ వ్యాపారం చేశాడు. ఈ వ్యాపారంలో ఆశించిన లాభాలు రాకపోవడంతో మానేశాడు. ఆ తర్వాత కారం పొడి తయారు చేసేందుకు ఫ్లోర్‌ మిల్‌ను ఏర్పాటు చేశాడు.

ఇందుకు సంబంధించిన మిషనరిని ఉస్మాన్‌గంజ్‌లో ఏర్పాటు చేశాడు. స్వస్తిక్‌ బ్రాండ్‌ పేరుతో సాచెట్స్‌ తయారు చేయించి రెడ్‌ కలర్‌, ఆయిల్‌, ఇతర రసాయనాలతో ఎర్ర కారం పొడిని తయారు చేస్తున్నాడని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. ఆ తర్వాత ఈ కారం పొడిని స్వస్తిక్‌ బ్రాండ్‌తో మార్కెట్‌లో అమ్ముతున్నాడు. ఇంటెలిజెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ మేరకు అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి.. రూ.4 లక్షల విలువైన కల్తీ కరం పౌడర్‌, ముడి పదార్థాలు, ఫ్లోర్‌ మిల్‌ సామగ్రి, తదితర వస్తువులను సీజ్‌ చేశారు.

Next Story