Hyderabad: వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్‌ సమీక్ష

ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

By అంజి
Published on : 4 Jun 2025 1:43 AM

Hyderabad, CM Revanth, monsoon preparedness, officials

Hyderabad: వర్షాకాల సన్నద్ధతపై సీఎం రేవంత్‌ సమీక్ష

ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. అవసరానికి అనుగుణంగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని చెప్పారు. జంట నగరాల్లో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనులకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వీలైనంతగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల కోర్ అర్బన్ రీజియన్‌లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ ప్రాంతంలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు చెప్పారు. డీసిల్టింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్‌ కె. రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story