హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో తూలుతూ బీటెక్ చదువుతున్న విద్యార్థి సాకేత్ రెడ్డి తన స్నేహితుడితో కలిసి కారు డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి కృష్ణానగర్ వైపునకు వెళ్లే మార్గంలో కారు అత్యంత వేగంగా వెళ్ళుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పింది. కారు ఫుట్ పాత్‌పై ఎక్కి టెలిఫోన్ స్ధంభంను ఢీకొట్టి అమాంతంగా బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న సాకేత్ రెడ్డితో పాటు.. అతని స్నేహితుడికి గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికులు వెంటనే కారులోపల ఇరుక్కుపోయిన ఇద్దర్నీ బయటకు తీశారు. కారు డ్రైవర్ సాకేత్ రెడ్డికి పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. మద్యం మోతాదు 146 పాయింట్లుగా నమోదైంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దర్నీ జూబ్లీ హిల్స్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.