హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మ్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై కేసు నమోదు అయ్యింది. దీంతో వెస్ట్ మారేడ్‌పల్లిలో ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాసానికి పోలీసులు ఈ రోజు చేరుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు అక్కడ భారీగా మోహరించి.. ఒక్కసారిగా పోలీసులను అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా చేరుకుని ఆందోళన చేయగా ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, కార్య కర్తలకు మధ్యతోపు లాట జరిగింది.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపు చేసిన పోలీసులు.. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను పోలీస్ వెహికల్‌లో ఎక్కించుకుని మాసబ్‌ట్యాంక్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి స్పందిస్తూ.. ఎర్రోళ్ళ శ్రీనివాస్ అరెస్ట్ అక్రమమని అన్నారు. ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అంటూ ఫైర్ అయ్యారు. అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు అంటూ విరుచుకుపడ్డారు.