వైభవంగా హైదరాబాద్ బోనాలు.. బంగారు బోనం సమర్పిస్తానన్న విజయశాంతి
Hyderabad Bonalu. హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగవైభోగంగా
By Medi Samrat Published on 1 Aug 2021 3:03 PM ISTహైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగవైభోగంగా సాగుతున్నాయి. 113వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు బోనాలు తీసుకుని తండోపతండాలుగా అక్కడికి తరలివస్తున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో లాల్ దర్వాజ బోనాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేతలతో కలిసి విజయశాంతి అమ్మవారికి బోనం సమర్పించారు. టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పార్టీ నేతలున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.
బీజేపీ నేత విజయశాంతి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం బంగారు బోనం ఎత్తుకుంటానన్న మొక్కును బోనం సమర్పించి తీర్చుకున్నట్లు తెలిపారు. కరోన తగ్గాలని, అందరిని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. మంచి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే బంగారు బోనం సమర్పిస్తా అని మొక్కుకున్నట్లు తెలిపారు.
ఆషాడం బోనాల ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల దర్శనార్థం రెండు లైన్ల ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకువచ్చే మహిళలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు.ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనము చేసుకోవాలని ఆలయ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.