హైదరాబాద్: అమీర్‌పేట్‌లోని ఓ ఇంట్లో ఉహించని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఎల్‌జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ పేలిపోయింది. రన్నింగ్‌లో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి మెషీన్ లోపలి భాగాలు ఎగిరిపడ్డాయి. వాషింగ్ మెషీన్ భారీ శబ్దంతో పేలడంతో అందులోని పార్ట్స్ తునాతునకలు అయిపోయాయి. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సాధారణంగా లోడ్ ఎక్కువైనా, నిర్వహణ లోపాలు ఉన్నా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రికల్ తయారీ లోపాలూ పేలుడు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. కాగా అకస్మాత్తుగా వచ్చిన పేలుడు శబ్దంతో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నవారు కూడా ఉలిక్కిపడ్డారు. వాషింగ్ మెషీన్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎప్పటికప్పుడు సర్వీస్ కేంద్రాల ద్వారా తనిఖీ చేయించుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.