ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద మహిళలను వేధిస్తున్న 55 మంది అరెస్ట్
ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద మహిళా భక్తులను ఆటపట్టించి వేధిస్తున్న 55 మందిని గత మూడు రోజులుగా హైదరాబాద్ పోలీసులు, షీ టీమ్స్ బృందాలు అరెస్ట్ చేశాయి.
By అంజి Published on 22 Sep 2023 4:32 AM GMTఖైరతాబాద్ బడా గణేష్ వద్ద మహిళలను వేధిస్తున్న 55 మంది అరెస్ట్
హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద మహిళా భక్తులను ఆటపట్టించి వేధిస్తున్న 55 మందిని గత మూడు రోజులుగా హైదరాబాద్ పోలీసులు, షీ టీమ్స్ బృందాలు అరెస్ట్ చేశాయి. వేధింపుల ఘటనలు జరగకుండా గణేష్ పండళ్లు, రద్దీగా ఉండే ఇతర ప్రాంతాలను పర్యవేక్షించేందుకు ఈ బృందాలను నియమించారు. అశ్లీల చర్యలు, అనుచితంగా తాకడం లేదా మహిళలను వెంబడించడం వంటి వాటికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వ్యక్తులను వారు అరెస్టు చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను కూడా షీ టీమ్‌లు సేకరించాయి.
“3 రోజుల వ్యవధిలో బృందాలు ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద 55 మంది వ్యక్తులను వీడియో ఆధారాలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ఈ వ్యక్తులు రద్దీగా ఉండే వాతావరణాన్ని సద్వినియోగం చేసుకున్నారు, ఇక్కడ మహిళలు భక్తి కార్యక్రమాలలో మునిగిపోతారు. క్యూలలో కదులుతారు. ఈ క్రమంలోనే మహిళలపై ఆకతాయిలు అనుచితమైన చర్యలకు పాల్పడ్డారు” అని షీ టీమ్స్ డీసీపీ తెలిపారు. పట్టుబడిన వారిలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా వివిధ వృత్తుల వారు ఉన్నారు. అనుచితంగా తాకడం, అసభ్యకర వ్యాఖ్యలు, సంజ్ఞలు చేయడం ద్వారా మహిళలకు ఇబ్బంది కలిగించినందుకు వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
"సంబంధిత కేసులు నమోదు చేయబడ్డాయి, వారికి కౌన్సెలింగ్ అందించబడింది. వారిని కోర్టులో హాజరు పరుస్తున్నాము" అని డిసిపి చెప్పారు. రద్దీ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ వీడియో ఆధారాలతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ నంబర్ 9490616555 ను సంప్రదించాలని మరీ అత్యవసర పరిస్థితుల్లో అయితే 100కి డయల్ చేయవచ్చని సూచించారు.