ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. కోట్ల రూపాయలతో నిందితుడు పరార్‌

గవర్నమెంట్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీనివాస్ అనే వ్యక్తి పలువురిని నమ్మించి వారి వద్ద నుండి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించాడు.

By అంజి  Published on  11 July 2023 2:03 PM IST
Govt jobs, fraud, Hyderabad, Telangana

ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. కోట్ల రూపాయలతో నిందితుడు పరార్‌

హైదరాబాద్ నగరంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అయినా కూడా జనం మాయగాళ్ల మాటలు ఎలా నమ్ముతారో అర్థం కావడం లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా హామీ ఇస్తే చాలు ముందు వెనక ఆలోచించ కుండా ఆ వ్యక్తిని నమ్మి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఈ విషయమై పోలీసులు ఎన్నో మార్లు హెచ్చరికలు కూడా చేశారు. గవర్నమెంట్ ఉద్యోగం అని ఎవరైనా చెప్తే అట్టి వారి మాటలు నమ్మవద్దని రైల్వే శాఖలో ఉద్యో గాలు ఉంటే తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇస్తారని దానిని చూసి దరఖాస్తు చేసుకోవాలే.. కానీ మోసగాళ్ల మాటలు నమ్మవద్దు అంటూ గతంలో ఎన్నో మార్లు పోలీసులు నిరుద్యోగులను హెచ్చరించారు. అయినా కూడా జనాల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. కేటుగాళ్ల మాటలు విని ఇట్టే మోసపోతున్నారు.

సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోటిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి పలువురిని నమ్మించి వారి వద్ద నుండి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి కోట్లు దండుకొని అక్కడి నుండి ఉడాయించాడు. మోసపోయిన బాధితులందరూ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న కోటిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి తన నివాసం పరిసర ప్రాంతాల్లోని వ్యక్తులతో కలిసిమెలిసి ఉండేవాడు. బాధితులందర్నీ పరిచయం చేసుకొని కొంతకాలంగా సన్నిహితంగా మెదిగాడు. అనంతరం సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించాడు. కొన్ని ఏళ్లుగా అతనితో పరిచయం ఉండడంతో బాధితులందరూ అతని మాటలు నమ్మారు.

అనంతరం శ్రీనివాస్.. ఓన్‌జీసీ, రైల్వేలో ఉద్యోగాలు పేరుతో ఒక్కొక్కరి దగ్గర నుండి రూ.10 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ఆ విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 51 మందిని మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేసుకుని అక్కడి నుండి ఊడాయించాడు. శ్రీనివాస్ కనిపించకుండా పోవడంతో తాము మోసపోయామని గ్రహించిన 51 మంది బాధితులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. నిందితుడు కోటిపల్లి శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story