హైదరాబాద్: పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం ఆరో అంతస్తులో మంటలు చెలరేగాయి. అందులో నివసిస్తున్న కొంతమంది ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటా? లేకా గ్యాస్ సిలిండర్ లీకేజీ వల్ల జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. భవనంలో అగ్ని ప్రమాదంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఓ కుటుంబం భవనంలోనే చిక్కుకుపోయింది.
ఇంతలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబాన్ని కాపాడారు. అతను చేసిన సాహనాన్ని చూసి స్థానికులు సైతం ప్రశంసించారు. పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ మంటల్లో సైతం లెక్కచేయకుండా తన ప్రాణాలు పణంగా పెట్టి ఆ కుటుంబాన్ని కాపాడడంతో స్థానికులు కానిస్టేబుల్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఉన్నతాధికారులు కానిస్టేబుల్‌ని అభినందించారు. ఈఘటనలో పంజాగుట్ట లా అండ్ ఆర్డర్ పోలీసులు దశరథ రామ్ రెడ్డి, సత్యనారాయణ అనే కానిస్టేబుల్లు సైతం శ్రమించి బాధితులను కాపాడారు. డంబెళ్ళతో కిటికీలను పగలగొట్టి ఆ కుటుంబ సభ్యులను బయటికి తీసుకొచ్చారు.