బంజారా హిల్స్‌లో దొరికిన రూ.3 కోట్లు
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల సమయంలో డబ్బులు ధారాళంగా వాడేస్తూ ఉంటారనే విషయం తెలిసిందే..
By Medi Samrat Published on 10 Oct 2023 12:47 PM GMTతెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల సమయంలో డబ్బులు ధారాళంగా వాడేస్తూ ఉంటారనే విషయం తెలిసిందే..! ఇలాంటి సమయంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో తనిఖీలు మొదలుపెట్టింది. డబ్బు, మద్యం తరలింపుపై పోలీసులు నిఘా పెట్టారు. వాహనాలను ఎక్కడికక్కడ ఆపేశారు. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో రూ. 3 కోట్ల 35 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ డబ్బులకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు.
చందానగర్ పరిధి తారానగర్‌లో వాహనాల తనిఖీల్లో 5.56 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు రెండు బైక్‌లను సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.11.50లక్షలు పట్టుబడ్డాయి. ఫరూక్‌నగర్ మండలం రాయికల్ టోల్‌ప్లాజా వద్ద నగదును సీజ్ చేశారు. బైక్‌పై వెళ్తున్న షాద్‌నగర్‌కు చెందిన అశోక్ అనే వ్యక్తి వద్ద నగదును గుర్తించారు. డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలను చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఇక శేరిలింగంపల్లి పరిధిలోని గోపనపల్లిలో కాంగ్రెస్ నేత ఫొటోతో ఉన్న రైస్ కుక్కర్లను పంపిణీ చేస్తున్న కొందరిని గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి 87 కుక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురంలో నాలుగు లక్షల రూపాయలను సీజ్ చేశారు. బషీర్ బాగ్ తనిఖీల్లో భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.