జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును క్లియర్ చేసినందుకు సీజేఐకి ప్రత్యేక ధన్యవాదాలు అని కేటీఆర్ ట్వీట్ చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఈ తీర్పు దోహదపడుతుందని కేటీఆర్ అన్నారు. "ఇంటి స్థలాల కేటాయింపులపై తెలంగాణ జర్నలిస్టు సంఘం దీర్ఘకాలిక డిమాండ్‌ను క్లియర్ చేసినందుకు సుప్రీం కోర్టు సీజేఐకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది తెలంగాణ ప్రభుత్వం తమ జర్నలిస్ట్ మిత్రులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుంది" అని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాల కోసం చాలా కాలంగా పోరాటం చేస్తున్న జర్నలిస్టులకు సుప్రీంకోర్టు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల నిర్మాణం, సేకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణకు ఒక రోజు ముందు, ఆయన నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసుపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం విచారించింది. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. అలాగే జర్నలిస్టులు వారి వారికి కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు జరుపుకోవచ్చని స్పష్టం చేసింది.