రాజాసింగ్‌ బెయిల్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

High Court notices to Telangana government on Raja Singh's bail. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌పై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు తరలించారు.

By Medi Samrat  Published on  7 Sep 2022 10:32 AM GMT
రాజాసింగ్‌ బెయిల్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ను పోలీసులు పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసి జైలుకు తరలించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో రాజాసింగ్ భార్య ఉషా బాయి తన భర్తకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్‌ను అక్రమంగా నిర్బంధించారంటూ ఉషాబాయి పిటిషన్‌లో పేర్కొన్నారు. పలు కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేయడం అన్యాయమన్నారు. రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు.

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ పీడీ యాక్ట్ కింద జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ధ్రువీకరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 1651ను కొట్టివేయాలంటూ ఉషాబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ అక్తర్, జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వాదనలు వినిపించడానికి ఒక రోజు గడువు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అడిగారు. కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోరారు. ఈ మేరకు విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.


Next Story