గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జనవరి 26న ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్లో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో అధికారులు రాజ్ భవన్ కు ఇరువైపులా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజీగూడ, రాజీవ్ గాంధీ స్టాచ్యూ, రాజ్ భవన్ మెట్రో రెసిడెన్సీ, ఖైరతాబాద్ వీవీ స్టాచ్యూ జంక్షన్ వరకు ట్రాఫిక్ఎక్కువగా ఉంటుందని.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని, పోలీసులకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి సుధీర్ బాబు అందుకు సంబంధించి ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు.
ట్రాఫిక్ రద్దీ ఉండే జంక్షన్లు:
1) సోమాజిగూడ,
2) మోనప్ప ఐలాండ్ (రాజీవ్ గాంధీ విగ్రహం),
3) రాజ్‌భవన్ మెట్రో స్టేషన్
4) వివి విగ్రహం జంక్షన్ (ఖైరతాబాద్).
పైన పేర్కొన్న సమయాల్లో రాజ్ భవన్ క్వార్టర్స్ రోడ్ (మెట్రో రెసిడెన్సీ) ఇరువైపులా సాధారణ ట్రాఫిక్ కోసం మూసివేస్తారు. పౌరులందరూ పైన పేర్కొన్న ట్రాఫిక్ సలహాను గమనించి, ట్రాఫిక్ రద్దీ జంక్షన్‌లను నివారించాలని, వారి గమ్యాన్ని చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు అభ్యర్థించారు.