హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. మ్యాన్‌హోళ్లు తెరిస్తే క్రిమినల్‌ కేసులు

హైదరాబాద్‌ నగరంలో గడిచిన నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే జలమండలి అప్రమత్తం అయ్యింది.

By అంజి  Published on  21 July 2023 4:39 AM GMT
Heavy rains, Hyderabad, Criminal cases, manholes

హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. మ్యాన్‌హోళ్లు తెరిస్తే క్రిమినల్‌ కేసులు

హైదరాబాద్‌ నగరంలో గడిచిన నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే జలమండలి అప్రమత్తం అయ్యింది. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సహాయక చర్యల గురించి ఉన్నతాధికారులతో ఎండీ దానకిశోర్‌ అడిగి తెలుసుకున్నారు. తాగునీటిలో తగిన మోతాదులో క్లోరిన్‌ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. ఓవర్‌ఫ్లో అయ్యే మ్యాన్‌హెళ్లను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని ఎండీ దానకిశోర్‌ అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీస్‌శాఖతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ప్రజలు మ్యాన్‌హెళ్లను తెరవద్దన్నారు.

జలమండలి యాక్ట్‌లోని 74వ సెక్షన్‌ ప్రకారం.. మ్యాన్‌హెళ్లు తెరవడం నేరమని, అతిక్రమిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు అవుతాయని ఎండీ వార్నింగ్‌ ఇచ్చారు. ఎక్కడైనా మ్యాన్‌హెల్‌ మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నట్టు కనిపించినా వెంటనే జలమండలి కస్టమర్‌ కేర్‌ నంబర్‌ 155313కి ఫోన్‌ చేసి ఇన్ఫర్మేషన్‌ ఇవ్వాలని కోరారు. నగరంలో 22 వేలకుపైగా మ్యాన్‌హెళ్లకు సేఫ్టీ గిల్స్‌ ఏర్పాటు చేశారు. లోతు ఎక్కువ ఉన్న మ్యాన్‌హోళ్లపై మూతలు, సేఫ్టీ గ్రిల్స్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ వాటర్‌ లాగింగ్‌ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలన్నారు. అలాగే ముంపునకు గురైన మ్యాన్‌హోళ్ల వద్ద వార్నింగ్‌ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దాదాపు 16 ఈఆర్టీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది. ఈ బృందాలకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లో జనరేటర్‌తో కూడిన డీవాటర్‌ మోటర్‌ ఉంటుంది. వర్షం కారణంగా ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతుంది. ట్రాఫిక్‌ ఎక్కడ ఆగకుండా చర్యలు తీసుకుంటున్నామని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌ బాబు తెలిపారు. మరోవైపు విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌లలోకి వరదనీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాల్లోకి వరద తాకిడి గురువారం సాయంత్రం నుంచి మొదలైంది.

Next Story