ముంచెత్తిన భారీ వర్షం.. స్తంభించిన హైదరాబాద్ నగరం.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
హైదరాబాద్‌లో నిన్న కుండపోత వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఎగధాటిగా రెండు, మూడు గంటల పాటు నగరం మొత్తం భారీ వర్షం పడింది.
By - అంజి |
ముంచెత్తిన భారీ వర్షం.. స్తంభించిన హైదరాబాద్ నగరం.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
హైదరాబాద్‌లో నిన్న కుండపోత వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ఎగధాటిగా రెండు, మూడు గంటల పాటు నగరం మొత్తం భారీ వర్షం పడింది. దీంతో నగరమంత అస్తవ్యస్తం అయిపోయింది. టోలీచౌకిలోని ఓ కాలనీలో వరద ఉద్ధృతికి ఆటోలు, బైక్‌లు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఇళ్లలోకి నీరు చేరడంతో వస్తువులన్నీ పాడైనట్టు స్థానికులు వాపోయారు. నగరంలోని చాలా లోతట్టు ప్రాంతాల్లో ఇదే దుస్థితి కనిపించింది. వరదలకు సంబంధించిన వీడియోలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి.
రోడ్లన్నీ జలమయం కావడంతో.. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైనా అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షం కారణంగా నగరంలో మెట్రో రైళ్లు కిటకిటలాడాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రజలు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. ఎల్‌బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లే రైళ్లు రద్దీగా కనిపించాయి. కనీసం నిలబడేందుకు కూడా చోటులేని పరిస్థితి నెలకొంది. నగరంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాలలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి, ఫలితంగా అనేక ప్రధాన ప్రదేశాలలో ట్రాఫిక్, జలమయం ఏర్పడింది.
లక్డికాపూల్, రాణిగంజ్, షాదన్ కాలేజ్ ఖైరతాబాద్, కెసిపి జంక్షన్, రోడ్ నంబర్ 12 విరించి హాస్పిటల్ జంక్షన్, పంజాగుట్ట నుండి రాజ్ భవన్ రోడ్డు మరియు ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అలాగే పలు చోట్ల మ్యాన్ హోల్స్ పొంగిపొర్లాయి. బంజారాహిల్స్‌లో 10 సెం.మీ వర్షపాతం రికార్డు కాగా, దేవరకొండ బస్తీ నీట మునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, DRF, ట్రాఫిక్ సిబ్బందిని ఐఎండీ అలర్ట్ చేసింది. రాబోయో రెండు, మూడు రోజుల్లో కూడా నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.