అర్థరాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం
Heavy rain lashes parts of Hyderabad last night.భాగ్యనగరాన్ని వానదేవుడు వదలడం లేదు. మొన్నటి వరకు కురిసిన
By తోట వంశీ కుమార్ Published on 26 July 2022 2:40 AM GMTభాగ్యనగరాన్ని వానదేవుడు వదలడం లేదు. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాల నుంచి ఇంకా కోలుకోకముందే సోమవారం అర్థరాత్రి దాటాక మరోసారి హైదరాబాద్ జంట నగరాల పరిధిలో వాన దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, ఖైరతాదాబ్, పాతబస్తీ, కోఠి, అబిడ్స్, మలక్‌పేట, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, ముషీరాబాద్, చార్మినార్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, బార్కస్, చాంద్రయాణగుట్ట, సైదాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, రాయదుర్గం, కుషాయిగూడ, ఖాజాగూడ, వనస్థలిపురంలో భారీ వర్షం కురిసింది.
దాదాపు మూడు గంటల పాటు వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. మూసారాంబాగ్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించింది. దీంతో మూసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట రైల్వే వంతెన కింద భారీగా వరద నీరు చేరడంతో వంతన వద్ద రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇప్పటికే చెరువులు అన్ని దాదాపుగా నిండిపోవడంతో తాజా వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయ భయంగా కాలం గడుపుతున్నారు. మంగళవారం ఉదయం వరకు నగరంలోని అనేక ప్రాంతాలతో పాటు, పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొన్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
వర్షాపాతం నమోదు వివరాలు
అత్యధికంగా హస్తినాపురంలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్‌పేటలో 8.9 సెంటీమీటర్లు,కుర్మగూడలో 8.8 సెం.మీ, ఝాన్సీ బజార్లో 8.7 సెం.మీ, చార్మినార్ ,నారయణ గూడల లో 8.5 సెం.మీ,నాంపల్లిలో 8.1 సెం.మీ, ఎల్బీనగర్ లో 7.7 సెం.మీ, విజయనగర్ కాలనీలో 7.5 సెం.మీ, శేర్లింగంపల్లి లో 7.4 సెం.మీ, హయత్ నగర్ లో 7 సెం.మీ, ఆసిఫ్ నగర్ లో 6.7 సెం.మీ, రామంతపూర్ లో 6.5 సెం.మీ, బేగంబజార్ లో 6.2 సెం.మీ, సరూర్ నగర్, అంబర్‌పేటలో 5.9 సెం.మీ, జియా గూడలో 5.8 సెం.మీ, గన్ ఫౌండ్రీ లో 5 సెం.మీ, నాగోల్ లో 4.4 సెం.మీ, అత్తాపూర్ లో 4.1 సెం.మీ, గాజుల రామారావు లో 3.5 సెం.మీ, బాలనగర్ లో 3సెం.మీ, జీడిమెట్లలో 2.4 సెం.మీ, సీతాఫల్ మండీలో 1.9 సెంటీమీటర్లు, నేరేడుమెట్‌లో 1.2 సెం.మీ ల వర్షపాతం నమోదైంది.