హైదరాబాద్ మెట్రో రైలులో తొలిసారి గుండెను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు వైద్యులు. మెట్రో రైలు అధికారుల సహకారంతో కామినేని ఆస్పత్రి వైద్యులు అపోలోకు బ్రెయిన్ డెడ్ అయిన మనిషి గుండెను తరలించనున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్యక్తికి అమర్చనున్నారు.
ఇదేక్రమంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె అమర్చడానికి శస్ర్తచికిత్స ఏర్పాట్లు చేశారు వైద్యులు. డాక్టర్ గోఖలే నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి గుండెను మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో తరలించనున్నారు. ఈ నేఫథ్యంలో నాగోలు మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఉండే ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో మార్గాన్ని వైద్యులు ఎంచుకున్నారు.