హైదరాబాద్ మెట్రో రైలులో గుండె తరలింపు

ఎల్బీనగర్‌లోని కామినేని హాస్పిటల్ నుంచి లక్డీకాపూల్‌లోని ఓ హాస్పిటల్‌కు గుండెను మెట్రోలో తరలించారు.

By Knakam Karthik  Published on  18 Jan 2025 8:01 AM IST
telugu news, Hyderabad, hyd metro

హైదరాబాద్ మెట్రో రైలులో గుండె తరలింపు

హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సంగతి గురించి కొత్తగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎమర్జెన్సీ టైమ్‌లో వేగంగా వెళ్లేందుకు అసలు వీలు కూడా ఉండదు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు హైదరాబాద్ మెట్రోను ఆశ్రయించారు. ఎల్బీనగర్‌లోని కామినేని హాస్పిటల్ నుంచి లక్డీకాపూల్‌లోని ఓ హాస్పిటల్‌కు గుండెను మెట్రోలో తరలించారు.

సాధారణంగా మనిషి అవయవాలను అంబులెన్స్‌లోనూ, విమానాల్లోనూ తరలిస్తుంటారు. అయితే నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ దృష్ట్యా గుండె తరలింపునకు హాస్పిటల్ వైద్యులు హైదరాబాద్ మెట్రోను ఎంపిక చేసుకున్నారు. ఈ మేరకు మెట్రో అధికారులతో సంప్రదింపులు జరిపారు. మెట్రో సిబ్బంది కూడా ముందుకు రావడంతో మెట్రో రైలులో గుండెను తరలించారు.

దీంతో మెట్రో రైలు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్ మైట్రో రైలు గ్రీన్ కారిడార్ ద్వారా ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు దాత గుండెను సురక్షితంగా వేగంగా తరలించారు. హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు, వైద్య నిపుణులు, ఆస్పత్రి సిబ్బందుల సమన్వయంతో గుండె తరలింపు ప్రక్రియ సక్సెస్ అయింది.

ఓ నిండు ప్రాణాన్ని కాపాడటం కోసం మెట్రో సిబ్బంది, వైద్య సిబంబంది కలిసి ప్రతి చోట సమర్థతతో పని చేశారు. అనుకున్న సమయంలో గుండెను గమ్యస్థానం చేరడంతో.. గుండె మార్పిడికి సంబంధించిన ప్రక్రియలన్నింటినీ వైద్యుల పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు. దీంతో మెట్రో సిబ్బంది, డాక్టర్లపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story