* రూ.1 కోటి 64 లక్షల ఉప్పల్ స్టేడియం కరెంట్ బిల్లు చెల్లింపు
* అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
* హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు
పదేండ్లగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్‌పీడీసీఎల్)తో నడుస్తున్న విద్యుత్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు, కార్యదర్శి దేవ్‌రాజ్ నేతృత్వంలో కార్యవర్గం శాశ్వత ముగింపు పలికింది. 2015లో పురుడు పోసుకున్నా ఈ విద్యుత్ జగడానికి తమ కార్యవర్గం శుభం కార్డు వేసిందని జగన్‌మోహన్ రావు వెల్లడించారు. సుమారు రూ.1.64 లక్షల విద్యుత్ బిల్లు బకాయిగా ఉండగా, ఐపీఎల్ సమయంలో తొలుత రూ.15 లక్షలు చెల్లించామని చెప్పారు. మిగిలిన మొత్తం 4-5 వాయిదాల్లో చెల్లిద్దామని ఆలోచన చేసినా హెచ్‌సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అంతా చెల్లించేసేమన్నారు. మంగళవారం (టీఎస్ఎస్‌పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీకి రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521ల మొత్తాన్ని చెక్ రూపంలో అందించినట్టు చెప్పారు.
అధికారులపై చర్యలు తీసుకోవాలి
ఐపీఎల్ సందర్భంగా విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందనే కారణంతో క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ కట్ చేసి, హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎండీ ఫరూఖీని జగన్‌మోహన్‌రావు కోరారు. పదేండ్ల కిందట పురుడు పుసుకున్న ఈ సమస్యకు తమను బాధ్యులను చేస్తూ ఐపీఎల్ సమయంలో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో క్రికెటర్లు ఇబ్బంది పడడంతో పాటు జాతీయ స్థాయిలో ఈ విషయం సంచలనమైందని, ఇందుకు బాద్యులైన వారిపై విచారణ జరిపి, శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని జగన్‌మోహన్ రావు విజ్ఞప్తి చేశారు.