యూనివర్శిటీలో విద్యార్థులను కలిసేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని అనుమతించాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను తెలంగాణ హైకోర్టు బుధవారం కోరింది. మే 7న రాహుల్ గాంధీ పర్యటనకు యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించడంపై.. వర్సిటీలో విద్యార్థులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది.
యూనివర్సిటీ రిజిస్ట్రార్ అనుమతి నిరాకరిస్తూ ఏప్రిల్ 30న ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్ఎస్‌యూఐ నాయకులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అసంబద్ధమైన కారణాలతో యూనివర్శిటీ అనుమతిని నిరాకరించిందని, ఇది చట్టవిరుద్ధం, ఏకపక్షం, వివక్షత, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని విద్యార్థి విభాగం పేర్కొంది. అనుమతి కోసం ఏప్రిల్ 22న వీసీని సంప్రదించామని, అయితే వీసీ తమకు అనుమతి ఇవ్వలేదు సరికదా అభ్యర్థనపై స్పందించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు.
అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒత్తిడి మేరకు వీసీ వ్యవహరిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతను చైతన్యవంతులను చేయడమే రాహుల్ గాంధీ పర్యటన ఉద్దేశమని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు.
వాదనలు విన్న హైకోర్టు.. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ వీసీని ఆదేశించింది. అయితే ఓయూలో రాహుల్ గాంధీతో సహా కేవలం 150 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఈ అంశంలో తమకు హైకోర్టు నుంచి సానుకూల తీర్పు రావడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.