గ్రేటర్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన డిప్యూటీ మేయర్
గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఆమె భర్త, బీఆర్ఎస్ కార్మిక సంగం నాయకుడు శోభన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
By Medi Samrat Published on 25 Feb 2024 3:37 PM ISTగ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఆమె భర్త, బీఆర్ఎస్ కార్మిక సంగం నాయకుడు శోభన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్‌లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి శ్రీలత రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోతే శ్రీలత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 2000 సంవత్సరం నుండి బిఆర్ఎస్ పార్టీలో పనిచేశాను. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులుగా మాకు సరైన న్యాయం జరగలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్తగారింటి నుండి తల్లి గారి ఇంటికి వచ్చినంత ఆనందం కలిగింది. ఎవరి ఒత్తిడి లేకుండానే ఇష్టపూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు.
మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టడం రాజీనామా చేయడం జరిగింది.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాదని.. ధనబలం ఉన్నటువంటి వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మా కుటుంబంలో మా తమ్ముడుతో మొదలైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల పట్ల తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడినప్పటికీ ఉద్యమకారులను గుర్తించకపోవడం పట్ల కాంగ్రెస్ వైపు రావడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు సైతం రేవంత్ రెడ్డి పెద్దపిట్ట వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉద్యమకారులకు గౌరవం దక్కుతుందనే ఉద్దేశంతో పార్టీలో చేరాం. గ్రేటర్ హైదరాబాద్ లో మాతోనే టీఆర్ఎస్ పార్టీ మొదలైంది.. మాతోటే బీఆర్ఎస్ పార్టీ ముగుస్తుందన్నారు.